కాంగీ ఇంకా చాలా నేర్చుకోవాలి ! 2 m ago
లోక్సభ ఫలితాల ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్ ఫలితాలు మేథోమథనం అవసరమని నిరూపిస్తున్నాయి. మంగళవారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ హర్యానాలో ఓడిపోలేదని నిపుణులు అంచనావేస్తున్నారు. పార్టీ నేతల మధ్య సమన్వయలోపం ఉందని అంటున్నారు. ఒకరిపై ఒకరు కడుపులో కత్తులు పెట్టుకుని పైకి ప్రేమలు కురిపించారన్న ప్రచారాన్ని రాజకీయ విశ్లేషకులు సమర్ధిస్తున్నారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఫలితాలు కాంగ్రెస్కు రెండు సంవత్సరాల క్రితం జరిగిన అంశాలను గుర్తుచేస్తున్నాయి. కాంగ్రెస్ ఎదుగుదలకు కేవలం పార్టీ బలమేకాకుండా అందుకు ఇతరుల అండదండలు అవసరమని జమ్మూ కాశ్మీర్లో ఫలితాలు చూపించాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ మరియు ఢిల్లీలో జరగనున్న మూడు అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఈ ఫలితాల ప్రభావం ఉండే అవకాశముంది. జమ్మూ అండ్ కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ (NC)తో కలసి కాంగ్రెస్ రంగంలోకి దిగింది. నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేసిన 51 స్థానాలకు గాను 42 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 32 స్థానాల్లో కేవలం 6 మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ కేవలం కూటమి భాగస్వామి నేషనల్ కాన్ఫరెన్స్ అండదండలతోనే జమ్మూ అండ్ కాశ్మీర్లో అధికారంలోకి రాగలిగిందన్నది ఈ ఫలితాలు నిరూపించాయి. నవంబర్లో ఎన్నికలు జరగనున్న జార్ఖండ్లో కూడా కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)కి భాగస్వామిగా ఉంది. అక్కడ కూడా కాంగ్రెస్ సొంతగా ఎదిగేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ ఫలితాలు గుర్తుచేస్తున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేకతనూ కూడగట్టుకోలేక.....
హర్యానాలో గడచిన పదేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంటూ వస్తోంది. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకతను కూడా కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో పరాజయాల తర్వాత హర్యానా కూడా ఇప్పుడావరుసలో వచ్చి చేరింది. రాష్ట్రంలో 15 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకోవడంలో కాంగ్రెస్ విఫలమవడంతో మధ్యప్రదేశ్లో పార్టీ పరాజయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది.
స్వంతగా ఎదిగేలా....
కాంగ్రెస్ పార్టీ తన వ్యూహం గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే బీజేపీతో ఎక్కడ ప్రత్యక్ష పోరు జరిగినా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది. అది ఎందుకు జరుగుతుంది? అనేది పార్టీ అంతర్లీనంగా ప్రశ్నించుకుని మెరుగైన పనితీరుతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇదే అభిప్రాయాన్ని శివసేన (యుబిటి) నాయకురాలు ప్రియాంక చతుర్వేది కూడా వ్యక్తంచేశారు. ఇక ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT) మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి భాగస్వామిగా ఉంది. ఈ కూటమితో కాంగ్రెస్ తదుపరి ఎన్నికలకు వెళుతోంది. అప్పటికైనా లోపాలను సరిచేసుకుంటుందని భావించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ కూటమి కష్టాలు మహారాష్ట్రకే పరిమితం కాలేదు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో ఢిల్లీలో కఠినమైన చర్చలు జరగనున్నాయి. ఫిబ్రవరిలోపు ఢిల్లీకి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. హర్యానా ఫలితాలు సందర్భంగా ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలలో ఎప్పుడూ అతి విశ్వాసం ఉండకూడదనేది ఈ ఫలితాల నుండి నేర్చుకున్న అతిపెద్ద గుణపాఠం అని కేజ్రీవాల్ న్యూఢిల్లీలో AAP మున్సిపల్ కౌన్సిలర్లతో అన్నారు. కేజ్రీవాల్ ఆప్ సభ్యులతో మాట్లాడుతున్నప్పటికీ, ఆయన మాటలు కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడినట్లు కనిపించింది. హర్యానాలో అతివిశ్వాసంతో కాంగ్రెస్, ఆప్తో పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించింది.